Friday 5 February 2021

Is Lord ShriKrishna creats solar eclipse to kill Saindhava

శ్రీకృష్ణుడు గ్రహణం సృష్టించాడా ?
 
ఒక సంవత్సరం శ్రీగణేశ విగ్రహ నిమజ్జనం అయిపోయన మరుసటి రోజున హైదరాబాద్ లో ఒక వింత ఆకాశంలో జరిగింది. మధ్యాహ్నం 11 గంటల సమయంలో భయంకరమైన చీకట్లు నగరాన్ని కమ్ముకున్నాయి. ఎపార్ట్ మెంట్లలో చీకట్లు కమ్ముకొని లైట్లు వేసుకోవాల్సి వచ్చింది అనడం కన్నా రోడ్ల మీద కూడా వాహనాలు లైట్లు వేసుకొని తిరిగాయి అన్నది నిజం.
 
 ఆ సమయంలో ఆకాశం చూసిన వాళ్లు, మారిపోయిన వాతావరణం గమనించిన వారు, ఏనుగు తొండాల ధారతో వర్షం పడుతుందని నిశ్చయించేసుకొన్నారు. అప్పటికి ఇంకా నిమజ్జనం కొనసాగుతోంది. ఇంకా కొన్ని వందల విగ్రహాలు నిమజ్జనం జరగాల్సి ఉంది. అందరూ వినాయకుని ప్రార్థిస్తూ కూర్చున్నారు. స్వామి మొరవిన్నాడో ఏమో కానీ ఆకాశంనుంచి చిన్నగా వర్షం మాత్రమే పడింది. అందరూ ఊపిరి తీసుకొన్నారు.
 
 హైదరాబాద్ వారందరికీ ఆరోజు పూర్తిగా గుర్తుకు వచ్చిందనుకుంటాను. ఇప్పుడు చెప్పబోయే అంశం అర్థం కావాలంటే మీరు ఒక చిన్న ప్రయోగం చేయాలి. ఇది మానసికంగా చేయండి. ఇందులో ముందుగా మీ చేతికి ఆధునిక గడియారాలు లేవు అనుకుందాం. సమయం తెలుసుకోవడానికి కేవలం సూర్యుడిని మాత్రమే ఉపయోగిస్తున్నారనుకోండి. అలాగే ఆకాశంలో రాకాసి మబ్బులు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం 5 గంటలకు అయింది అనుకోండి. ఇంతే మీరు చేయాల్సింది. 

  ఇప్పుడు చెప్పిన దానికి మీ మూడ్ సెట్ అయితే సరిగ్గా మహాభారతంలో ఇదే జరిగింది. మీరు మానసికంగా పూర్తిగా సన్నద్ధులు అయితే ఇప్పుడు చెప్పేది బాగా అర్థం అవుతుంది.

 మహాభారతంలో సైంధవుడిని చంపిన ఘట్టం అర్థం కావాలంటే ఇది అవసరం.

Is-Lord-ShriKrishna-creats-solar-eclipse-to-kill-Saindhava
సింధుదేశానికి చెందిన జయద్రథుడు (సైంధవుడు) చెయ్యని దుర్మార్గపు పని లేదు. కౌరవుల చెల్లెలు దుస్సల భర్త అయిన వాడు, ద్రౌపదికి అన్నవంటివాడు అయిన సైంధవుడు, ద్రౌపదిని బలాత్కారంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. వీడిని భీముడు పట్టుకొని బుర్రగొరిగించి పంపుతాడు. దాంతో వాడు పగపడతాడు. మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చావుకు కారణం అయిన వాడు సైంధవుడే. ఇటువంటి సైంధవుడిని (సింధుదేశరాజు) సూర్యాస్తమయంలోపల చంపేస్తానని లేదంటే తాను ప్రాణత్యాగం చేస్తానని అర్జునుడు ప్రతిన చేశాడు.

 ఇది తెలిసిన కౌరవులు ఎగిరి గంతేశారు. అసలు యుద్ధం చేయకుండా కేవలం సైంధవుడిని సాయంత్రం వరకు దాచేస్తే అర్జునుడు తన ప్రాణాలు తానే తీసేసుకుంటాడు అని కౌరవులు ఎత్తుగడ వేస్తారు. అర్జునుడు చనిపోతే ధర్మరాజు ప్రాణాలు తీసేసుకుంటాడు. 😯 ఎందుకంటే పాండవుల్లో ఏ ఒక్కరు నిహతులైనా తాను బ్రతకనని ధర్మరాజు అన్నాడు.😯 ధర్మరాజే లేకుంటే పాండవులు యుద్ధం ఓడిపోయినట్టే. యుద్ధం గెలవడానికి ఇంత దుర్మార్గమైన అవకాశం మరొకటి రాదని దుర్యోధనుడి దగ్గర నుంచీ ఆఖరి సైనికుడి వరకూ అంతా సైంధవుడిని మధ్యలో పెట్టుకొని దడికట్టి కూర్చున్నారు.

 😱నిజానికి సైంధవుడిని చంపినా అర్జునుడు చనిపోతాడు. ఎందుకంటే ఎవరు చంపితే సైంధవుడి తల నేలను తాకుతుందో, ఆ హంతకుని శిరస్సు వందముక్కలు కావాలని సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడు వరంపొందాడు😱. సింధు రాజ్యం సైంధవుడికి అప్పగించి ఆయన అరణ్యంలో తపస్సు చేసుకొంటూ ఉంటాడు. ఇంత సంక్లిష్టమైన వాడిని చావుబ్రతుకుల సమస్యలో నుంచీ సైంధవుడిని చంపి అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి.

 సూర్యోదయం కాగానే యుద్ధం మొదలు అవుతుంది. ఏకంగా ఆరుగురు మహారథులు సైంధవుడిని మధ్యలోపెట్టుకొని కాపుకాస్తారు. అర్జునుడి పై సమస్త సైన్యం కేంద్రీకృతం అవుతుంది. అర్జునుడు కూడా భీకరయుద్దమే చేస్తాడు. కానీ సమయం మించిపోతోంది. సూర్యాస్తమయం అయింది అంటే అర్జునుడు స్వయంగా ఆత్మహత్య చేసుకోవాలి. కౌరవుల వ్యూహం గమనించిన శ్రీకృష్ణుడికి పరిస్థితి అర్థమైపోతుంది. వారి వ్యూహాన్ని భేదించి సైంధవుడిని చంపడం దాదాపు అసంభవం అనే అర్థమైపోతుంది. ఆ సమయంలో కృష్ణుడు రంగంలోకి దిగుతాడు.

 ఇప్పటి వరకూ చెప్పింది పీఠిక మాత్రమే.

 ఇప్పుడే అసలు కథ ప్రారంభం అవుతోంది.

 చాలా మంది సినిమా భారతాలు చూసి శ్రీకృష్ణుడు అప్పుడు రాబోతున్న సూర్య గ్రహణం ముందుగా ఊహించి ముందస్తు చీకటి వస్తోందని, సాయంత్రం అయిపోయింది కనుక సైంధవుడు బయటకు వస్తాడని చంపేయమని అర్జునుడికి చెప్పారని అంటారు.

అది శుద్ధ అబద్ధం.

ఎందుకంటే పూర్వం గ్రహణం అనేది ఎప్పుడు వస్తుందో అందరికీ తెలుసు. కురుపాండవులు సూర్య గ్రహణం తెలియని వారేం కాదు. వారు వేదవేదాంగశాస్త్రాలు చదువుకున్నవారు. నిజానికి పురాణాల్లో కూడా గ్రహణాల గురించి. పురాణాలు కూడా వేదాల సమానంగా అపౌరుషేయాలుగా ఏర్పడ్డాయి. వీటిని 18 పురాణాలుగా విడదీసిన వాడు వ్యాసుడు. కనుక కేవలం శ్రీకృష్ణుడికే రాబోయే గ్రహణం గురించి తెలుసు అనడం నిజంకాదు.

 ఈ ఘట్టంలో మరో అబద్ధం కూడా చాలా బలంగా ప్రచారం అయింది. 

శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి భూమికి మధ్య అడ్డంగా ప్రయోగించాడని కొందరు ప్రచారం చేశారు. నిజానికి ఇదీ తప్పే. ఎందుకంటే సంపూర్ణ సూర్యగ్రహణంలో మాదిరిగా డైమండ్ రింగ్ ఏర్పడేట్టు సుదర్శన చక్రం ప్రయోగించి ఉంటే అది సూర్యగ్రహణంలో భాగమే అయి ఉండేది. అటువంటి ప్రయత్నం చేసి ఉంటే అప్పటికే కౌరవులు శ్రీకృష్ణుడిని మాయలోడుగా లెక్కవేశారు కనుక ఇట్టే అది విష్ణుమాయగా గుర్తించి ఉండేవారు. ఎందుకంటే హఠాత్తుగా ఏర్పడినా, పంచాంగం ప్రకారం ఏర్పడినా గ్రహణం గ్రహణమే కనుక వారు సైంధవుడిని బయట పెట్టి ఉండేవారు కాదు. 

 కనుక శ్రీకృష్ణుడు సంపూర్ణ సూర్య గ్రహణం సుదర్శన చక్రంతో సృష్టించేంత వాడేం కాదు. ఆ విధంగా చేస్తే అసలుకే మోసం వస్తుందని తెలిసినవాడే.

 ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా తెలుసుకోవాలి.

సైంధవుడిని చంపాలంటే వాడి తల ఖండించి దాన్ని ఆకాశంలో ఎగరేసి సరిగ్గా సైంధవుడి తండ్రి ఒళ్ళో పడేట్టు చేయాలి. ఇది గమనార్హం. సమయం కాని సమయంలో గ్రహణం వస్తే సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడు కూడా అప్రమత్తమై ఉండేవాడు. ఆ సమయంలో ఆయన గ్రహణ సమయంలో చేయాల్సిన కర్మలు చేస్తాడు కానీ సంధ్యావందనం చేస్తూ కూర్చోడు. వ్యాసుడు స్పష్టంగా సాయం సంధ్యాదికాలు చేస్తున్నాడు అని చెప్పాడు. 

 ఏతస్మిన్నేవ కాలే తు వృద్ధక్షత్రో మహీపతిః। సంధ్యాముపాస్తే తేజస్వీ సంబంధీ తవ మారిష॥

 ఈ ఇతివృత్తం తీసుకొని ఆంధ్రవ్యాసుల వారిని ప్రశ్నించడం జరిగింది.

మహాభారతయుద్ధంలో వచ్చింది సంపూర్ణ సూర్య గ్రహణమా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఆయన వ్యాసభగవానుడి సాక్షిగా చెప్పిన సమాధానమే ఇది.

శ్రీకృష్ణుడికి ఏ మాత్రం సందేహం లేకుండా అర్జునుడి వల్ల కాదని తెలిసిపోయింది. మహారథుల్ని ఒక్క రోజులో చంపేసి వారి వెనుక ఉన్న సైంధవుడిని చంపడం అయ్యేపనికాదు. కనుక శ్రీకృష్ణుడు తన యోగమాయ చేత ఆకాశంలో సూర్యుడిని కనిపించకుండా చేస్తాను అని మాత్రమే చెప్పాడు. ఇక్కడ గమనించాల్సింది మరొకటి ఉంది. ఎప్పుడెప్పుడు సూర్యాస్తమయం అవుతుందా అని అంతా సూర్యుడి మీదే మనస్సు లగ్నం చేసుకున్నవారు ఆ సమయంలో గ్రహణం సృష్టిస్తే తప్పకుండా అది మాయే అని కౌరవులు అనుమానించి ఉండేవారు. కానీ కృష్ణుడు చాలా పకడ్బందీగా కేవలం సూర్యుడు కనిపించకుండా చేశాడు.

ఇది చేయబోయే ముందు అర్జునుడు ఒక్క సారిగా కౌరవ మహారథుల మీద విరుచుకుపడి భీకరమైన యుద్దం చేసి వారి దృష్టి చెదరగొట్టాడు. అప్పటి వరకూ ఉన్న అర్జునుడిలో హఠాత్తుగా వచ్చిన మార్పుతో కౌరవులు గందరగోళంలో పడిపోయారు. యుద్ధంలో మునిగి ఉన్న వాళ్లు ఎప్పుడైతే సూర్యుడు కనిపించలేదో టైం ఎంత అయిందో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒళ్ళు మరచిపోయి యుద్ధం చేస్తున్నాం సాయంత్రం అయిపోయింది అని సూర్యుడు కనిపించకపోయేసరికి అనుకొని ఉంటారు. 

 ఇక్కడ కృష్ణుడు కూడా తన మాయను పొద్దుగాల పొద్దుగాల చేయలేదు. అలా చేసినా ఇప్పుడే కదా తెల్లారింది అప్పుడే సూర్యుడు మాయం కావడం ఏమిటి? ఇది కచ్చితంగా విష్ణుమాయే అని కౌరవ క్రిమినల్స్ అనుమానించి ఉండేవారు. కౌరవులంతా ఒక ఎత్తు అయితే సన్యాసాశ్రమం స్వీకరించి తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్రుడుకూడా సాయం సంధ్యా సయమం అయింది అని అనుమానం వచ్చే విధంగా సంధ్యావందనం చేసుకుంటూ కూర్చునే సమయాన్ని కృష్ణుడు ఎంచుకున్నాడని మనం గ్రహించాలి. ఇది అర్థం చేసుకోవాలంటే ముందుగా నేను చెప్పిన హైదరాబాద్ ఘటన ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి. మధ్యాహ్నం 11 గంటలకు కాకుండా అదే సంఘటన 5 గంటలకు జరిగి ఉంటే (మనకు వాచీలు లేవు కేవలం సోలార్ డయల్స్ మాత్రమే ఉన్నాయని మరిచిపోకండి) అందరం కూడా చాలా నాచురల్ గా సాయంత్రం అయిపోయింది అనే అనుకొని ఉండేవాళ్లం. దారుణంగా వరదగూడేసిన ఆకాశం మనకు తెలిసి ఉండేది కాదు. 

భారతంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఆంధ్రవ్యాసుల వారు వేదవ్యాసుల వారి సాక్షిగా చెప్పినదానికి నేను తాజా ఉదాహరణ తేలిగ్గా అర్ధం కావడానికి జోడించడం జరిగింది. ఇది మహాభారత యుద్ధ సమయంలో జరిగింది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఆంధ్రవ్యాసుల వారు చెప్పారు. కృష్ణుడు ముందుగా తాను చేయబోతున్న పని అర్జునుడికి చెబుతాడు. తాను సూర్యుడిని దాచేసి చీకట్లు కల్పించబోతున్నానని, భయపడవద్దని, సూర్యాస్తమయం అయింది అనుకొని సైంధవుడు బయటకు వస్తాడు వాడ్ని చంపేయమని చెబుతాడు. భయపడవద్దని ఎందుకు చెబుతాడంటే, సంధ్యాసమయం అయింది అంటే గాండీవం పారేసి తలనరుక్కుని అర్జునుడు చనిపోయే అవకాశం ఉంది. కనుక ముందుగా అర్జునుడిని హెచ్చరించి వాడి తలను చెవికి ఉన్న కుండలాలతో సహా కురుక్షేత్రం ప్రక్కనే ఉన్న స్యమంతపంచక వనంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్రుడి ఒడిలో పడాలని, ఆ ముసలాడు ఎక్కడున్నడో వాడి లాంగిట్యూడు, లాటిట్యూడు సహా చెబుతాడు. 

 (స్యమంతపంచకాద్బాహ్యే శిరస్తదహరచ్ఛరైః॥) 

 ఇలా చెప్పిన తరువాత సాయంకాలవేళ చీకట్లు మసక చీకట్లు సృష్టిస్తాడు. కృష్ణుడు చెప్పినట్టే కౌరవులు మోసపోతారు. సైంధవుడు హయ్మయ్యా సంధ్యావాలిపోయింది అని తలెత్తి సూర్యుడు ఉన్నాడా అని చూస్తాడు. 

 ‘‘అదిగో తల, అదిగో మెడ, కొట్టేయ్‘‘ అంటాడు కృష్ణుడు. అర్జునుడు తూచా తప్పకుండా అలాగే కొట్టి తలను అరణ్యంలో ఉన్న వాడి తండ్రి ఒడిలో పడేట్టు కొడతాడు. ధ్యానం లో ఉన్న ముసలాడు మసక చీకట్లో ఒళ్ళో ఏం పడిందో చూసుకోలేడు. దానికితోడు జుట్టు, చెవుల కుండలాలు కూడా అడ్డు రావడంతో లేచినిలుచుంటాడు. శిరస్సు భూమిమీద పడుతుంది. ముసలాడి తల 100 ముక్కలు అవుతుంది. 

 ఇది అక్షరాలా భారతంలో వ్యాసుడు రాసింది. దీనికి చిలవలు పలవలుగా చేర్చి అంతా తమకు తెలిసిన, ఉన్న పైత్యాలతో ఏదేదో రాసుకువచ్చారు. అయితే ఆంధ్రవ్యాసుల వారు ఒక విషయం మాత్రం కచ్చితంగా సమాధానం చెప్పారు. శ్రీకృష్ణుడు సృష్టించింది సూర్యగ్రహణమే. అయితే అది అందరికీ తెలిసిన సూర్యగ్రహణం కాదు. ఎందుకంటే సూర్యగ్రహణం అంటే ఏమిటి? సూర్యుడిని ధూమ్రవర్ణంలో ఉన్న రాహువు కమ్మివేయం. సూర్య తేజస్సుకు అడ్డుపడడం. జ్యోతిశ్శాస్త్ర ప్రకారం చెప్పాలంటే సూర్యుడికి, భూమికి మధ్యగా ఏదో ఒకటి అడ్డువచ్చి (చంద్రుడు) భూమికి సూర్యుడు కనిపించకుండా పోవడం. అదే శ్రీకృష్ణుడు కూడా చేశాడు. అయితే ఆయన సృష్టించింది కేవలం చీకట్లు కలిగించే గ్రహణం మాత్రమే. అది కూడా కౌరవులకు ‘‘భ్రమ (మోహం)‘‘ కలిగేటట్టు చేశాడు. అందులోనూ సంధ్యాసమయం ఒక అరగంట ముందు వచ్చేట్టు చేశాడు అను కున్నా తప్పులేదు. లోక కంటకమైన సూర్యగ్రహణం కృష్ణుడు సృష్టించలేదు. కేవలం మోహజనితమైన చీకట్లు మాత్రమే సూర్యుడిని మాయం చేసి సృష్టించాడు. సైంధవుడిని చంపడం ఏమిటి కృష్ణుడు మళ్లీ సూర్యుడిని తెప్పించాడు. దీంతో కౌరవులకు జరిగింది విష్ణుమాయ అని అర్థం అయింది. ఈ 14 రోజు అతి ముఖ్యమైంది. ఎందుకంటే ఈ ఒక్కరోజే అర్జునుడు, భీముడు, సాత్యకి కలిసి 8 అక్షౌహిణుల కౌరవ సైన్యం చంపివేశారు. ఇదంతా చెప్పిన తరువాత ఆంధ్రవ్యాసుల వారు ‘‘గ్రహణం అనేది రాక్షస శక్తులు భూమి మీద పడే వేళ. ఒకడిని చంపడానికి మానవాళికి నాశనం కలిగించే సూర్యగ్రహణం కృష్ణుడు సృష్టించలేదు. కేవలం మోహాజనితమైన తమస్సు సృష్టించాడు. నిజానికి ఇది గ్రహణంకన్నా కష్టమైంది. గ్రహణం సృష్టించడం కష్టమైందేం కాదు. కానీ విధ్వంసం లేని గ్రహణం కల్పించడం కష్టం. అదే కృష్ణుడు చేశాడు. గ్రహణంలో సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ ఏకంగా ఆకాశంలో సూర్యుడినే మాయం చేశాడు. గ్రహణం కన్నా బాబులాంటిది కృష్ణుడు సృష్టించాడు. టెక్నికల్ గా చెప్పాలంటే ఇది కూడా గ్రహణం లాంటిదే. ఎందుకంటే సూర్యుడిని కప్పివేశాడు కనుక. కానీ విధ్వంసక శక్తులు ప్రేరేపించే రాహుగ్రహణం వంటిది కాదు. 

ధూమ్రాకారో నీలతనుర్వనస్థో2పి భయంకరః వాతప్రకృతికో ధీమాన్ స్వర్భానుస్తత్సమః శిఖీ అంటోంది బృహత్_పరాశర హోర. 

అటువంటి రాక్షస గ్రహణం కాకుండా చాలా జాగ్రత్తగా చీకట్లు కలిగించే గ్రహణం సృష్టించాడు. భగవంతుడు మాయ చేసినా దాని వెనుక ఎంతగా సృష్టి క్షేమం దాగి ఉంటుందో తెలిపే అద్భుత ఘట్టం అది.‘‘ అని అన్నారు. నేడు భారతీయుల్లో గ్రహణాలు అంటే అవగాహన లేని కుక్కమూతి పిందెలు తయారై మీడియా నుంచీ సోషల్ మీడియా వరకూ భౌభౌ మంటున్నాయి. కనుకనే ఈ అతి ముఖ్యమైన విషయాలు చర్చించాల్సి వచ్చింది. ఇప్పటి వరకూ ఆంధ్రవ్యాసులవారు గ్రహణాల మీద చెప్పిన వాటిలో సందర్భాను సారం ఈ క్రిందిఅంశాలు చర్చించాము.
 1)గ్రహణాలు విధ్వంసకాలా? 
 2) గ్రహణాల విధ్వంసాలు అత్రిమహర్షి తప్పించగలరా? 
 3) గ్రహణాలు సృష్టించగలమా?
 4) జ్యోతిష్యం శాస్త్రమా కాదా?
 5) గ్రహణాలను అపహాస్యం చేస్తే ఏమవుతుంది? వీటిని ఆదరించిన అందరికీ ధన్యవాదములు చెబుతూ, సనాతన ధర్మాన్ని ఎగతాళిచేస్తే వినాశం ఏరి కోరి తెచ్చుకున్నట్టేని హెచ్చరిస్తున్నాము. _ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం ప్రత్యామ్నాయ మాధ్యమ పాత్రికేయ నిపుణుడు ..

Tags:
సైంధవుడు, వృద్ధక్షత్రుడు, story of Saindhava samharam by lord Krishna miracles, Mahabharata stories in telugu, best interesting tales from Mahabharat

Post a Comment

Whatsapp Button works on Mobile Device only