Thursday 25 September 2014

శరన్నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు అమ్మవారి అవతారములు:: విశిష్టతలు:: బ్రహ్మచారిణి :: బాల త్రిపుర సుందరి :: Navaratri 2nd day Brahmacharini Balatripurasundari

శరన్నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు అమ్మవారి అవతారములు:: విశిష్టతలు::
1. శ్రీశైల భ్రమరాంబిక రెండవ రోజు అవతారం “బ్రహ్మచారిణి” :
Brahmacharini
దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.

హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి.
ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.

ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.

బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.“
దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమెకృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.

2.  విజయవాడ కనకదుర్గా నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారి స్వరూపం  “బాల త్రిపుర సుందరి”.
Shri Bala Tripura Sundari Devi
శ్రీశక్తి కౌమారి రూపం "బాల" -. అమ్మవారి మూడు రూపాలలో కనిపిస్తుంది - ఒకటి కుమారిగా బాలత్రిపుర సుందరి, రెండు యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి, మూడు వృధ్ధరూపం త్రిపురభైరవి. బాల త్రిగుణైక శక్తి - సరస్వతి విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్నది. బాల ఆనందప్రదాయిని. బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక.
మనసు,బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి, నిత్యసంతోషం కలుగుతుంది. షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.శ్రీ చక్రంలో మొదటి దేవత బాల. కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహంకోసం ఉపాసకులు ముందు బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల భక్తుల పూజలందుకుంటుంది.ఈ రోజున రెండు నుండి పదేళ్ళలోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా పూజ చేసి, కొత్తబట్టలు పెట్టాలి."ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందర్యై నమః" అని నూటెనిమిది సార్లు చదవాలి. అమ్మవారికి ప్రత్యేకం గా పాయస నైవేద్యం పెట్టాలి. త్రిశతి పారాయణం చెయ్యాలి.
శ్రీబాల అందరినీ ఆశీర్వదించుగాక

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశాంకుశధరామ్ స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరస్పర కళాం శ్రీచక్ర సంచారిణీం //
నవరాత్రులు

Post a Comment

Whatsapp Button works on Mobile Device only