Friday, 13 June 2014

వేదముల గురించి తెలుసుకొనేందుకు భరద్వాజ మహర్షి చేసిన ప్రయత్నం - వేదముల గొప్పతనం - The depth & greatness of Veda


వేదసారము వేదములు నాలుగు అని తెలుసుకున్నాము కదా!
వేదము 1134 శాఖలుగా విభజించబడినది.
ఒక శాఖ క్షుణముగా అధ్యయనము చేయడానికి దాదాపు ఎనిమిది సంవత్సరములు పడుతుంది.
ఇన్ని శాఖలు క్షుణముగా అధ్యయనము చేయడానికి ఒక మానవ ఆయుష్షు చాలదు. దీనిగురించి ఒక కధ ఉంది.
భారద్వాజుడు అనే మహర్షి మొత్తం వేదాన్ని పూర్తిగా అధ్యయనము చేయాలని సంకల్పించాడు.
నిష్టగా అధ్యయనము చేస్తూ వచ్చాడు. ఆయుష్షు చాలదనిపించి, వేదాధ్యయనము ఆపి ఇంద్రుని గూర్చి తపించాడు.
ఇంద్రుడు వచ్చాడు. " ఏం నాయనా! ఏం కావలి?" అనడిగాడు ఇంద్రుడు.
" నాకు వంద సంవత్సరాల అయుష్షు కావాలి " అనడిగాడు భారద్వాజ మహర్షి. " ఆ ఆయుష్షుతో ఏం చేస్తావు" అనడిగాడు ఇంద్రుడు.
" వేదాధ్యయనము " చేస్తాను అన్నాడు మహర్షి.
"మంచిది" అంటూ వంద సంవత్సరాల ఆయుష్షు అనుగ్రహించాడు ఇంద్రుడు. భారద్యాజుడు తన వేదాధ్యయనము ను కొనసాగించాడు. ఇంద్రుడిచ్చిన ఆయుష్షు అయిపోతోందని గ్రహించి ఇంద్రుడిని ప్రార్ధించి మరోవంద సంవత్సరాలు ఆయుష్షు పొంది వేదాధ్యయనము కొనసాగించాడు.అయినా వేదాధ్యయనము పూర్తికాలేదు.మరో వంద సంవత్సరాలు ఆయుష్షు పొంది తిరిగి వేదాధ్యయనము చేశాడు. అయినా సంతృప్తి కలగక అశాంతి తో తల్లడిల్ల సాగాడు భరద్వాజ మహర్షి. ఈసారి ప్రార్ధించకుండానే ప్రత్యక్షమయ్యాడు ఇంద్రుడు. "ఏం! నాయనా! ఇంత వేదము చదివి ఇలా అశాంతిగా ఉన్నావేమిటీ? " అనడిగాడు. " ఇంద్రుడు. "వేదాన్ని మొత్తం చదివేద్దామనుకున్నాను. కాని మీరిచ్చిన ఆయుష్షు చాలటం లేదు. అస్తమానము మిమ్మల్ని అడగటము బాగుండదు కదా!" అని బాధపడ్డాడు మహర్షి. "అయితే చూడు!" అంటూ మూడు కొండల్ని ఆయన ముందు సృష్టించాడు. "ఏమిటవి" అనడిగాడు మహర్షి. " అవి వేదములలొని విజ్ఞాననికి ప్రతీకలు." అంటూ ఆ మూడు కొండలలో నుండి మూడు పిడికిళ్ళ మట్టి తీసి " ఇది నీవు ఇప్పటివరకు పొందిన జ్ఞానం" అని అంతర్ధానమయ్యాడు. అంటే, భారద్వాజ మహర్షి అంతటి నిష్టాగరిష్టునికి, మూడువందల సంవత్సరముల పైగా అధ్యయనము చేసిన లభ్యము కాని వేదవిజ్ఞానము ఒక సామాన్య మానవులమైన మనకి ఎలా లభ్యమవుతుంది. కాని, భగవంతుడు కరుణామయుడు. ఆయన మానవులందరికి వేదవిజ్ఞానము అందుబాటులోకి తేవాలని సంకల్పించి వేదాన్ని "ఆవృత్తము" ( మళ్ళీ మళ్ళీ తదేక దీక్షతో చదవటం) చేయటం ఆరంభించాడు. అలా కొన్ని వేల సార్లు ఆవృత్తములు జరిగిన పిదప "భు:" భువ:", ", సువః" అనే మూడు వ్యాహృతులు వెలువడ్డాయి. దీనిని కూడా అభ్యసించలేని అజ్ఞానంలో మానవులు ఉన్నారని గ్రహించి, మనస్వామి ఆ మూడు వ్యాహృతులు మళ్ళీ "ఆవృత్తము" చేయడం ఆరంభించాడు. అప్పుడు "అ,ఉ,మ" అనే అక్షరాలు వెలువడ్డాయి. ఆ మూడిటిని స్వీకరించి కలిపి "ఓం" అని "ఓంకారమును" సృష్టించి, మానవులకిచ్చి ఇది వేదసారము. ఇది స్వీకరించి, అనుష్టానము చేసి, వేదవిజ్ఞానము పొందండి" అని భగవంతుడు మానవులకు ఉపదేశము చేశాడు. ఇది "ఓం కారము " సర్వ వేదసారము అని ఉపనిషత్తులో చెప్పిన ఉదంతము. హాయిగా కుర్చుని "ఓం", "ఓం" అనుకుంటూ వేదప్రతిపాద్యుడైన భగవంతుని పొందటానికి ఎంత సులభ మార్గము ఆ దయామయుడు మనకు సమకూర్చాడు. ఆ భగవంతుని మనము "ఓంకారము" తోనే ప్రార్దిస్తాము. ఏమంత్రమైనా ముందు "ఓం" అనే వేదసారాన్ని కలపకపోతే నిష్ప్రయోజనమని పెద్దలు చెప్పుతారు. అయితే "ఓం" కారోపాసన గాని, మంత్రోపాసన గాని సద్గురువు ఉపదేశముతోనే మనము అనుష్టించాలి. స్వస్తి.
Courtesy: Jaji Sarma garu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only