Thursday, 13 February 2014

కదిరి శ్రీలక్షీనరసింహాస్వామి దేవాలయం


కదిరి శ్రీలక్షీనరసింహాస్వామి దేవాలయం

లక్షీనరసింహాస్వామి దేవాలయం నవ నారసింహ క్షేత్రాల లో ఒకటి. ఇక్కడి విశిష్టత ఏమిటంటే మరే నారసింహ క్షేత్రములో లేని విధంగా స్వామి వారు ప్రహ్లాదుని సమేతముగా దర్శనము ఇస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా జరుగుతాయి. ప్రధానముగా బ్రహ్మగరుడ సేవ, అత్యంత ప్రధానముగా జరిగే బ్రహ్మ రథోత్సవము(తేరు) అతి వైభవముగా జరుగుతాయి. వీటిని దర్శించేందుకు 
కదిరి చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. తేరు రోజున కదిరి జనసంద్రమును తలపిస్తుంది. దేవస్థానముకు సంభందించిన తీర్థాలు కదిరికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి భృగు తీర్థము (కోనేరు), ద్రౌపది తీర్థము, కుంతి తీర్ఠము, పాండవ తీర్థము, వ్యాస తీర్థము మొదలగునవి.

చారిత్రకత
ఎత్తైన ప్రహారీతో, విశాలమైన ఆవరణలో విలసిల్లుతున్న ఈ కదిరి నరసింహాలయం: 13 వ శతాబ్దంలో దశలవారీగా అభివృద్ది చెందిందని శాసనాల వలన తెలుస్తున్నది. ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు కలిగి ఉన్నది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్థంభాలపై ఉన్న శిల్ప కళా రీతులు అత్యంత సుందరం గా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు.

ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనిమిస్తారు. " బేట్రాయి సామి దేవుడా....నన్నేలినోడా........... బేట్రాయి సామి దేవుడా కదిరి నరసింహుడా................... కాటమరాయడా ................. ఇలా భక్తుల చే కొనియాడబడే ఈ నరసింహ స్వామి విశిష్టత చాల గొప్పది. వేదారణ్యమైన ఈ ప్రాంతంలో ఖదిర చెట్లు ఎక్కువగా ఉన్నందున దీనికి కదిరి అని పేరు వచ్చింది. ఖదిరి చెట్టు అనగా చండ్ర చెట్టు. ఈ అలయంలో రంగ మండపం పై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లున్నా, ఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్థంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్థంభం పునాది లో నుండి కాకుండా ఒక బండ పైనే అలా నిలబెట్టి ఉన్నది.

ఉత్సవాలు

ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేట కు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాల ప్రాముఖ్యత ఉన్నది. ఈ రథం 120 టన్నుల బరువుండి ఆరు చక్రాలతో సుమారు నలబై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రధోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాస ముంటారు. ఏటా ఈ అలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ద చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ద పౌర్ణమి , చింతపూల తిరుణాళ్లను, అషాడపౌర్ణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.

ఆలయ విశిష్టత

ఎక్కడా లేని ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమంటే.............. .ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామి ని కొలుస్తుంటారు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడ వస్తుంటారు. ఇక్కడి ఇంకో విశేష మేమంటే, కదిరి పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలో మీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రి మాను ఉన్నది. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో ఉన్నది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడ స్థానం సంపాదించు కున్నది. కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లె లో యోగి వేమన సమాధి కూడ వున్నది. ఇది కూడ పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

ఎక్కడున్నది ఈ క్షేత్రము ?

అనంతపురం జిల్లాలో ఉన్న కదిరి లోఈ ఆలయం ఉన్నది. ఇది పాకాల-- ధర్మవరం రైల్వే మార్గం లో ఉన్నది. కదిరి లో స్టేషన్ కూడ ఉన్నది. అదే విధంగా బస్సు సౌకర్యంకూడ బాగా ఉన్నది.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only