Sunday 19 September 2021

PCOD సమస్య గురించి ఇలాంటి వివరణ మీకు ఎక్కడా దొరకదు - PCOD identification and remedies

PCOD సమస్య గురించి ఇలాంటి వివరణ మీకు ఎక్కడా దొరకదు...
ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటే అది PCOD కావచ్చు...
బక్కపలచగా ఉన్నవారు ఒక్కసారిగా బరువు పెరిగినా... మొటిమలూ, అవాంఛిత రోమాల వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నా... నెలసరి సరిగ్గా రాకపోకపోయినా... ఇవన్నీ సహజమే అనుకోవడం... కొన్నిసార్లు సరి కాదు. అవి పీసీఓడీ (పాలీసిస్టిక్‌ ఒవరీ డిసీజ్‌ లేదా సిండ్రోమ్‌) లక్షణాలైతే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

అధ్యయనాల ప్రకారం ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికి పీసీఓడీ ఉంటుంది. అప్పుడే నెలసరి సమస్యలు మొదలవుతాయి. పాలీసిస్టిక్‌ అంటే.. ద్రవం తో నిండిన చిన్నచిన్న సంచులు. అంటే నీటి బుడగల్లాంటివి. అండం విడుదలకు ముందు అండాశయంలో అండం చిన్నదిగా ఏర్పడుతుంది. అది పెరగనప్పుడు ద్రవంతో నిండిన నీటి బుడగల్లాంటివి అండాశయంలో చేరతాయి. కొన్నిసార్లు అవి ఒకటి రెండు నుంచి పన్నెండు వరకూ ఉండొచ్చు. ఇవి క్యాన్సర్‌కు దారితీయకపోయినా వాటివల్ల ఇతరత్రా చాలా సమస్యలు ఎదురవుతాయి.

అధిక బరువూ... అవాంఛిత రోమాలు...
పీసీఓడీ ఉన్నా ఆ ప్రభావం హార్మోన్లపై ఉండనప్పుడు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. నెలసరి కూడా క్రమం తప్పకుండా వస్తుంది. అదే పద్ధతిలో అండం విడుదల అవుతుంది. ఎప్పుడైతే పీసీఓడీ వల్ల ఈస్ట్రోజెన్‌, ఆండ్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ లాంటి హార్మోన్ల అసమతూకం మొదలవుతుందో అప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. అలాగే ఇన్సులిన్‌ పెరగడం వల్లా పీసీఓడీ వచ్చే అవకాశముంది. ఎలాగంటే.. రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రించడంలో ఇన్సులిన్‌ పాత్ర కీలకం. అది పురుష హార్మోన్‌గా పరిగణించే టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అయితే చక్కెర స్థాయులు పెరిగినప్పుడు కండరాలూ, కొవ్వూ ఆ చక్కెర తీసుకునేలా చేయడం కోసం ఇన్సులిన్‌ ఎక్కువ కావాల్సి వస్తుంది. దాంతో టెస్టోస్టెరాన్‌ హార్మోను మోతాదూ పెరిగి అసమతూకం ఏర్పడుతుంది. ఈ మార్పులు అండాల విడుదలపై ప్రభావం చూపుతాయి. అప్పుడు నెలసరి ఇబ్బందులూ, సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోవడం, అవాంఛిత రోమాల వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఏయే సమస్యలంటే...

మొదట ఏర్పడే ఇబ్బంది అండం విడుదల ఆగిపోవడం. ఈ సమస్యతో బాధపడే ప్రతి పదిమందిలో ఏడుగురికి నెలసరి సరిగ్గా రాదు. రెండు మూడు నెలలకోసారి రావడం, వచ్చినా తక్కువ రక్తస్రావం కావడం, కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. అండం విడుదల ఆగిపోవడంతో, గర్భం దాల్చే పరిస్థితి ఉండదు. అందుకే కొన్నాళ్ల పాటు గర్భం రావడం లేదంటే.. డాక్టర్లు పీసీఓడీ ఉండొచ్చని సందేహించి పరీక్ష చేయించుకోమంటారు.

* ఈ సమస్య ఉన్న వారిలో సగం మందికి ముఖం, పొట్ట, ఛాతీ దగ్గర అవాంఛిత రోమాలు పెరుగుతాయి. టీనేజర్లలో అయితే మొటిమలు విపరీతంగా వస్తాయి. జుట్టు ఊడిపోతుంది. ఇవన్నీ ఒకెత్తయితే, ప్రతి పదిమందిలో నలుగురు బరువు పెరుగుతారు. కొన్నిసార్లు అది స్థూలకాయానికీ దారితీస్తుంది. వీటివల్ల ఆత్మవిశ్వాసం తగ్గి, ఒత్తిడికి లోనవుతుంటారు కొందరు.

పీసీఓడీ లక్షణాలు టీనేజీ నుంచి కనిపించవచ్చు. అయితే అందరిలోనూ ఒకే తరహా సమస్యలు, అంతే తీవ్ర స్థాయిలోనూ ఉండకపోవచ్చు. కొందరికి కేవలం అవాంఛిత రోమాలే ఉండొచ్చు. మరికొందరిని మొటిమలే బాధిస్తాయి. అవాంఛిత రోమాలతో పోలిస్తే ఒక వయసు వచ్చాక మొటిమల సమస్య చాలా మటుకు తగ్గుతుంది.

అదుపు చేసే మార్గాలివి..
పీసీఓడీని నిర్థరించడానికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌తో పాటూ రక్తపరీక్ష చేస్తారు. అయితే ఈ సమస్యకు శాశ్వత చికిత్స లేదు. కానీ లక్షణాల తీవ్రతను తగ్గిస్తే, సమస్య అదుపులోకి వస్తుంది. అందుకు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

Remedies for PCOD
* మొట్టమొదట బరువు తగ్గాలి. ఫలితంగా ఇన్సులిన్‌, టెస్టోస్టెరాన్‌ స్థాయులు అదుపులోకి వస్తాయి. అండం విడుదల జరిగి, నెలసరి ఇబ్బందులూ దూరం అవుతాయి. అవాంఛిత రోమాలూ, మొటిమల తీవ్రత కూడా తగ్గుతుంది. అయితే ఇది అనుకున్నంత సులువు కాదు. ఆకు కూరలూ, దంపుడుబియ్యం, ఓట్స్‌, పీచు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. కేక్‌లూ, బ్రెడ్‌, బర్గర్‌తో సహా ఇతరత్రా జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. వంటి జంక్‌ఫుడ్‌ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువు తగ్గాలని కడుపు మాడ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. సరైన ఆహార నియమాలు పాటించకపోతే చికిత్స తీసుకున్నా ఫలితం ఉండదు.

* అవాంఛిత రోమాలను నివారించేందుకు వ్యాక్సింగ్‌, హెయిర్‌ రిమూవింగ్‌ క్రీంలు వాడటం, ఎలక్ట్రాలిసిస్‌, లేజర్‌ చికిత్సలు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని తాత్కాలిక ఫలితాన్నిస్తే... ఎలక్ట్రాలిసిస్‌, లేజర్‌ దీర్ఘకాలంగా దాన్ని అదుపులో ఉంచుతాయి. ఈ చికిత్సలతో పాటూ డాక్టర్‌ సలహాతో కొన్ని మందులు వాడితే టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ సమతూకంలో ఉంటుంది. ఈ మాత్రల్ని కనీసం మూడు నుంచి తొమ్మిది నెలల పాటు తీసుకోవాలి. మొటిమల సమస్యను నివారించేందుకు కొన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణుల సలహాతో వాడొచ్చు.

* నెలసరిలో ఆటంకం లేదా అసలు రానప్పుడు వైద్యులు కొన్ని మందుల్ని సూచిస్తారు. ఎందుకంటే నెలసరి అసలు రాకపోతే అది గర్భాశయ క్యాన్సర్‌కు దారితీయొచ్చు. అందుకే అది సక్రమంగా వచ్చేలా గర్భనిరోధక మాత్రల్ని సూచిస్తారు. వయసూ, సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు గర్భాశయంలో ఇంట్రాయూటరైన్‌ పరికరాన్నీ అమరుస్తారు. దానివల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి రక్తస్రావం అవుతుంది.

గర్భం దాల్చడం..
టీనేజీలో ఈ సమస్య మొదలైనా.. భవిష్యత్‌లో గర్భం రావడం, రాకపోవడం అనేది ప్రతినెలా విడుదలయ్యే అండంపై ఆధారపడి ఉంటుంది. పీసీఓడీ ఉన్నా కొందరిలో ఈ సమస్య ఎదురవదు. అయితే ఈ సమయంలో గర్భం ధరిస్తే మాత్రం ఎప్పటికప్పుడు డాక్టర్‌ పర్యవేక్షణ అవసరం. ఎందుకంటే గర్భం నిలవకపోయే అవకాశాలే అధికంగా ఉంటాయి. ఒకవేళ నిలిచినా జస్టేషనల్‌ డయాబెటిస్‌, అధిక రక్తపోటు వంటి సమస్యలతో పాటూ నెలలు నిండకుండానే కాన్పు అయ్యే ప్రమాదమూ ఉంది. అందుకే ఈ సమయంలో ఏ ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

ఈ పరిస్థితికి భిన్నంగా మరికొందరిలో అసలు అండాలే విడుదల కావు. ఒకవేళ అదే జరిగితే గర్భం రాకపోవచ్చు. అలాంటప్పుడు గర్భధారణ కోసం ప్రత్యేక చికిత్సలు తీసుకోవాలి. అయితే మరీ లావుగా ఉన్న వారిలో ఈ చికిత్సలు తీసుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే ఈ చికిత్సలు
తీసుకుంటున్నప్పుడు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఫలితం కనిపిస్తుంది.

ఒకవేళ ఈ సమస్య దీర్ఘకాలంగా వేధిస్తుంటే, టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గర్భం ధరించినప్పుడు కూడా మధుమేహం రావడం, కొలెస్ట్రాల్‌ పెరగడం, అధికరక్తపోటు లాంటి సమస్యల ఎదురవ్వచ్చు. ఇవన్నీ భవిష్యత్తులో గుండె జబ్బులకు దారితీస్తాయి. కాబట్టి పీసీఓడీ లక్షణాలు ఉన్నాయనిపిస్తే, పరీక్ష చేయించుకుని, డాక్టర్లు చెప్పిన సూచనల్ని పాటించాలి.

For more details please consult

KMR UNIVERSAL HOSPITAL,
24/7 Multispeciality Hospital,
NH-65, Hyderabad-Vja Highway,
Nandigama.
For appointment
Call : 9014727757

Post a Comment

Whatsapp Button works on Mobile Device only