వేద నిర్వచనం::::::::::
హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శృతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.
ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా,, (ఇష్టప్రాప్తి,అనిష్టపరిహారం )కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం
వేదాలకు పేర్లు::::::::::
వేదాలకు
(1). శ్రుతి, (2). అనుశ్రవం, (3). త్రయి, (4). సమమ్నాయము, (5). నిగమము, (6). ఆమ్నాయము, (7). స్వాధ్యాయం, (8). ఆగమం, (9). నిగమం అని తొమ్మిది పేర్లున్నాయి.
1.శ్రుతి: - గురువు ఉచ్చరించినదాన్ని విని అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు.
2.అనుశ్రవం: - గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు.
3.త్రయి : - ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదములను కలిపి "త్రయి" అని పేరు.
4.సమమ్నాయము - ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి.
5.నిగమము - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి. యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు.
6.ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.
7. స్వాధ్యాయం - స్వాధ్యాయం అంటే--స్వ అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం
8.ఆగమం - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి.
వేదాలు సంఖ్య::::::::::
వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి(వేదాలను)ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.
1.ఋగ్వేదము
2.యజుర్వేదము
3.సామవేదము
4.అధర్వణవేదము
వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).
మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి
మంత్ర సంహిత
బ్రాహ్మణము
ఆరణ్యకము
ఉపనిషత్తులు
ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.
Post a Comment