Thursday 29 May 2014

యోగవిద్య: అర్థం - పరమార్థం: చతుర్విధ యోగ మార్గాలు:: The significance and meaning of Yoga - meditation

ప్రాచీన కాలం నుండి ప్రధానంగా నాలుగు రకాల యోగ మార్గాలు ప్రచారంలో ఉన్నాయి!!
అవి 1. కర్మయోగం,
       2. భక్తియోగం,
       3. జ్ఞానయోగం,
       4. రాజయోగం.
ఈ నాలుగు రకాల యోగాలు నాలుగు వేరు వేరు మార్గాలుగా చెప్పుకున్నా వీటి లక్ష్యం మాత్రం ఒక్కటే. అది మానవుడు దుఃఖాన్ని అధిగమించి మోక్షాన్ని పొందడమే. ప్రతి మనిషి జీవితంలోనూ కష్టసుఖాలు కావడి కుండలులా ఉంటాయి.  కష్టాల్లో కృంగి పోకుండా, సుఖాల్లో పొంగిపోకుండా జీవితాన్ని జాగ్రత్తగా నడుపుకోవడానికి సహకరించేవి ఈ యోగా పద్ధతులు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1. కర్మయోగం:
విసుగు విరామం లేకుండా పనిచేసే వ్యక్తిని ‘ఇతడు కర్మయోగి’ అనటం లోకంలో చూస్తాం. లోక వ్యవహారంలోని ఈ మాటలో కొంత సత్యం ఉన్నా కర్మయోగం అంటే కేవలం పనిచేయటం మాత్రం కాదు.
కర్మ అంటే పని అర్థం. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పనిని కర్మయోగం అంటారు. గాంధిగారు కర్మయోగి. ఆయన ప్రతిఫలాపేక్ష లేకుండా స్వాతంత్ర్యపోరాటం చేశారు.  ఆయన ఏ పదవిని ఆశించలేదు..
కర్మను యోగంగా అభ్యాసం చేయడం ద్వారా కూడా వ్యక్తి దుఃఖాతీతుడు కావచ్చు.  అందుకే భగవద్గీత  ‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన!’ అని  ‘నీకు కర్మలను చేసే అధికారం ఉంటుంది కాని వాటి ఫలితాలను ఆశించే అధికారం లేదు.’ అని చెబుతుంది. ఇది గొప్ప సత్యం. మనం పని చేసేటప్పుడు పనిమీదనే మనస్సునుంచాలి. ఫలితం మీద ఉంచకూడదు. ఎందుకంటే ఫలితం మీదకు మనస్సు వెళ్ళినప్పుడు పనిని సక్రమంగా చేయలేము.
పనిని ప్రారంభించేముందు ఇది ధర్మమా, అధర్మమా అని ఆలోచించి ధర్మమార్గాన్నే అనుసరించాలి.  ఇది మన కర్తవ్యం అని భావించి పని చేయాలి. అప్పుడు ఏ ఇబ్బంది లేదు. ధర్మకర్త దేవాలయాన్ని తన సొంత ఆస్తిగా భావించడు.  కాని, దేవాలయం కార్యాలను నిర్వహిస్తాడు.  అలాగే మనిషి ప్రపంచంలో తన పనులను నిర్వహిస్తే అది నిజమైన కర్మయోగం అవుతుంది. కొడుకుగా, తండ్రిగా, భర్తగా, పౌరుడిగా మనిషి అనేక విధులను నిర్వహించవలసి ఉంటుంది. ఆ విధులన్నింటినీ సాక్షీ మాత్రంగా నిర్వహించాలి.  అటువంటి వ్యక్తికి దుఃఖం దరిచేరదు. లాభం కలిగినప్పుడు భగవంతుడు ఇచ్చాడు అనుకుంటాడు. నష్టం కలిగినప్పుడు భగవంతుడు తీసుకున్నాడనుకుంటాడు. ఇచ్చినవాడు ఆయనే తీసుకున్న వాడు ఆయనే.... ఇది కర్మయోగం.
కొందరు కర్మయోగం అంటే వైదిక కర్మలను ఆచరించడంగా భావిస్తారు. యజ్ఞ యాగాది క్రియల ద్వారా ప్రకృతి, దైవ శక్తులను సంతృప్తి పరచడం కర్మయోగమని కొందరి అభిప్రాయం..

...... సశేషం (to be continued)
Courtesy:
Shri Venkateswara Yogi Guruji,
Shri Venkateswara Yoga Seva Kendram,
Mangalagiri.
Pn- 08645-234511

Post a Comment

Whatsapp Button works on Mobile Device only