Monday, 24 October 2022

దీపావళి నాడు..దీపాలు పెట్టడం వెనుక... తారాజువ్వలను మతాబులను కాల్చడం వెనుక ఈ కారణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు....

దీపావళి నాడు....దీపాలు పెట్టడం వెనుక... తారాజువ్వలను మతాబులను కాల్చడం వెనుక ఈ కారణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు....

చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని.... చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి పండుగను జరుపుకుంటాము...అని చెప్పుకుంటూ వుంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది.


శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.

ఇక పురాణ సంబంధమైన కథ ఇలా వుంటే, ధర్మ శాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.

ఈ రోజుల్లో వానలు కురవడం ... చలి పెరుగుతూ వుండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు..

Post a Comment

Whatsapp Button works on Mobile Device only