Thursday, 5 June 2014

సూర్యుడు వివిధ రాశులలో ఉండగా ఫలితాలు

సూర్యుడు వివిధ రాశులలో ఉండగా ఫలితాలు.......

సారావళీ గ్రంథం ఆధారంగా - రవి మేష రాశులలో వున్నప్పుడు జన్మించిన వారికి శాస్త్ర విజ్ఞానం అధికము. గ్రంథ రచనాసక్తి, కళల యందు అభిమానం, యుద్ధ ప్రియము, ఉత్సాహంగా ఉండుట, శూరత్వం కలిగి వుండు లక్షణాలు వుంటాయి.

వృషభ రాశిలో రవి ఉండగా జన్మించిన వారికి ముఖ, నేత్ర రోగములు ఉంటాయి. కష్టములు ఓర్చుకొను లక్షణములు కలిగి ఉంటాయి. శత్రువులు ఉండరు. మంచి భక్తుడు, వ్యవహార దీక్షత ఉండును. భోజన ప్రియుడు. సుగంధ ద్రవ్యములు భోగ వస్తువుల యందు ఆసక్తి కలవాడు అగును. సంగీత, వాయిద్య అభిలాష. అలాగే నీతి భయం కలుగును.

మిధున రాశి యందు రవి ఉండగా జన్మించిన వాడు - జ్ఞాపకశక్తి కలవాడు, మృదువుగా మాటలాడు స్వభావం కలవాడు, జ్ఞాతులు అధికంగా కలవాడు, ఆచారముల యందు ఆసక్తి కలవాడు, విజ్ఞానశాస్త్రం చదివిన వాడు, ధనవంతుడు, ఉదార బుద్ధి కలవాడు, నేర్పరి, జ్యోతిశ్శాస్తమ్రు తెలిసిన వాడు, రూపవంతుడు, సుబుద్ధి, వినయ విధేయతలు కలవాడు అయి వుండి పుత్ర సమానుడిగా ఇతర స్ర్తిల చేత కూడా ఆదరింపబడు లక్షణాలు కలవాడు అవుతారు.

కర్కాటక రాశిలో రవి వుండగా పుట్టినవాడు స్వకార్య చపలుడు, రాజుతో సమానమైన గుణములు కలవాడు, స్వపక్షంలో వారిని విమర్శించువాడు, స్ర్తిలచే ద్వేషింపబడువాడు, మంచి రూపము కలవాడు, కఫ పైత్య ఆరోగ్య సమస్యలు కలవాడు, శ్రమ యుక్తంగా జీవనం చేయువాడు, అందరినీ ఒకే విధంగా చూచువాడు అగును. భౌగోళిక శాస్త్రం మీద అవగాహన వున్నవాడు, స్థితిమంతుడు, జ్ఞాతద్వేషి అగును.

రవి సింహ రాశి యందు వుండగా జన్మించిన వారికి శత్రువులను జయించు లక్షణములు కలిగి ఉండుట, కోప స్వభావము, అవినీతి పనుల యందు ఆసక్తి, అడవులు, కోటల యందు సంచారము, సాహసం చేయు లక్షణములు, రౌద్ర స్వభావి, గాంభీర్యం కలవాడు, స్థిరబుద్ధి, చెవుడుకు సంబంధించి రోగం పొందువాడు, భూపాలకుడు, ధనవంతుడు, ప్రసిద్ధుడు అగును.

రవి కన్యారాశిలో వుండగా పుట్టినవాడు మృదువయిన దేహం కలవాడు, వ్రాతలో నేర్పరి, బలహీనుడు, లజ్జ కలవాడు, మంచి ప్రవర్తన కలవాడు, మేధావంతుడు, జ్ఞానసంపన్నుడు, విద్యావంతుడు దేవతల యందు పెద్దల యందు భక్తి కలవాడు, శృతి గేయ వాద్యముల యందు అభిమానం కలవాడు అగును. మృదువు వాక్ కలవాడగును.

రవి తుల యందు వుండగా పుట్టినవాడు సంఘంలో ఒంటరి, ధన వ్యయం చేసి బాధపడువాడు, విదేశీ విషయాసక్తి కలవాడు, ఇతరులచే ద్వేషింపబడువాడు, నీచులచే బాధింపబడువాడు, బంగారం మొదలగు లోహ విషయంగా వ్యాపారాది పరిజ్ఞానం వున్నవాడు, పరోపకార బుద్ధి కలవాడు, పరస్ర్తి వాంఛ కలవాడు, నీచ స్వభావి, రాజులచే అవమానింపబడువాడు అగును. ప్రగల్భాలు అధికంగా పలుకుతారు.

రవి వృశ్చికంలో వుండగా పుట్టినవాడు ఎదురులేని పరాక్రమం కలిగి, ధర్మమార్గం అనుష్ఠించు లక్షణములు గలవాడు, అయినను అసత్యాభిలాషణ కూడా ఉంటుంది. మూర్ఖం ఉంటుంది. చెడు మనుషుల యందు ద్వేషం ఉంటుంది. క్రూర స్వభావం, లోభితనం, కలహ స్వభావం ఉంటుంది. తల్లిదండ్రుల నుండి వైరి భావం పొందుతాడు. శరము, అగ్ని, విషము వలన నీటి వలన బాధలు పొందుతారు.

రవి ధనస్సులో ఉండగా పుట్టినవారు ధనవంతుడు, రాజునకు ఇష్టుడు, ప్రాజ్ఞుడు, దేవ బ్రాహ్మణ భక్తి కలవాడు, శస్త్రాస్త్ర ప్రయోగముల యందు నేర్పరి, వ్యవహారముల యందు నేర్పరి, సత్పురుషులచే పూజింపబడువాడు, శాంత స్వభావం కలవాడు, బలమయిన పొడవయిన శరీరము కలవాడు, బుద్ధిశాలి, బంధువులకు ఉపకారము చేయువాడు అగును.

రవి మకరంలో వుండగా పుట్టినవాడు లోభి, దుష్ట స్ర్తిల యందు ఆసక్తి కలవాడు, చెడ్డ స్వభావము, దురాశ కలవాడు అనేక కార్యములు చేయుట యందు ఆసక్తి కలవాడు, పిరికిదనం కలవాడు, తక్కువ బంధువర్గం కలవాడు, చంచల బుద్ధి, సంచారం యందు ఆసక్తి, బలహీన దేహం కలవాడు, బహు భక్షకుడు, పిత్రార్జితం పోగొట్టువాడు అగును.

రవి కుంభంలో సంచారం చేయునప్పుడు పుట్టినవారు హృద్రోగము కలవారు, బల సంపన్నుడు, సత్పురుషులచే నీచముగా చూడబడువాడు, రోషము కలవాడు, పర భార్యాసక్తత కలవాడు, తన కార్యముల యందు మాత్రము ఆసక్తి అధికంగా గలవాడు, స్వల్ప ధనము కలవాడు, స్నేహమందు అస్థిర బుద్ధి కలవాడు, నలుపు వాడు, లోభి, అనాలోచనతో మాటలాడువాడు అగును.

రవి మీనము నందు వుండగా పుట్టినవాడు మంచి స్ర్తి సౌఖ్యము కలవాడు, స్నేహితులు ధనం అధికంగా కలవాడు, ప్రజలలో గౌరవం లేనివాడు, ప్రాజ్ఞుడు, నీటి మీద వ్యాపారం చేయువాడు, ప్రియభాషి, అసత్యవాది, సుఖ రోగి, సేవకులు అధికంగా కలవాడు అగును. అయితే రవికి ఇతర గ్రహముల దృష్టి విషయంగా ఫలితములు మారును.

రవితో ఏదేని గ్రహం ముందు లేదా వెనుక పది డిగ్రీల లోపుగా దగ్గరగా వుంటే అస్తంగత్యం వస్తుంది అని శాస్త్రం. ఒక గ్రహం మరొక గ్రహంతో కలవడం అంటే ఆ రెండు గ్రహాల మధ్య కేవలం పది డిగ్రీల వ్యత్యాసం మాత్రమే వుండాలి. అలాగ రవితో ఇతర గ్రహ కలయిక ప్రభావం పరిశీలిస్తే రవి చంద్రుల కలయిక ప్రభావంగా నీతి నియమం లేనివాడు, కపట స్వభావి, ధనవంతుడు, కార్యసాధనాసక్తి కలవాడు అగును. రవి కుజులు కలిసి వుండగా జన్మించినవాడు మూర్ఖ స్వభావము, సాహసము బలము, అసత్య వాదన, పాప కార్యములు చేయుట, వధ యందాసక్తి కలిగి వుండును.

రవి బుధులు కలిసి వున్న సేవకుడు, ప్రియముగా మాటలాడువాడు, కీర్తి కలవాడు, పూజ్యుడు, రాజప్రియుడు, మంచి ప్రవర్తన కలవాడు, బలము, రూపము, ధనము కలవాడు అగును.

రవి గురువులు కలసి ఉండగా పుట్టినవాడు, ధర్మబుద్ధి కలవాడు, రాజుకు సలహాలు ఇచ్చువాడు, బుద్ధిమంతుడు, మిత్రుల వలన ధన లాభం పొందువాడు, ఉపాధ్యాయ వృత్తి కలవాడు అగును.

రవి శుక్రులు కలిసి వుండగా పుట్టినవాడు వృద్ధాప్యంలో దృష్టి దోషం పొందువాడు, శస్త్ర విద్య మొదలగు వాటిలో శక్తివంతుడు, వివాహానంతరం ధనము కుటుంబం వృద్ధి పొందువాడు అగును.

రవి శని కలిసి వుండగా పుట్టినవాడు భార్యాపుత్రులు వలన మనో విచారము కలవాడు, ధర్మ గుణములు కలవాడు అగును.

రవితో వచ్చే ప్రత్యేక రాజయోగములు వేశి రాశి ఉభయచర యోగములు. రవి వున్న స్థానమునకు వ్యయ స్థానమున చంద్రుడు కాక మరి ఏ ఇతర గ్రహములు వున్నను దానిని వాశి యోగము అని పేరు. రవికి ద్వితీయ స్థానంలో చంద్రుడు కాక మరి ఏ ఇతర గ్రహం వున్నను దానికి వేశి యోగము అని పేరు. రవి వున్న రాశికి రెండు వైపులా గ్రహములు వున్న ఎడల దానికి ఉభయచర యోగము అని పేరు.

Courtesy: Nerella Rajasekhar

Post a Comment

Whatsapp Button works on Mobile Device only