Saturday, 24 May 2014

శ్రీరాముడు నడయాడిన ప్రదేశం - రామేశ్వరం - స్థల పురాణం- యాత్రా విశేషాలు (Rameshwaram)


భగవంతుడిని పూజించుటకు మూడు లక్షణములుండవలెను..
1. మూర్తి,
2. స్థలము,
3. తీర్థము..
అవి మూడు ఈ క్షేత్రములో ఉండుట ఈ క్షేత్ర ప్రత్యేకత...
 మన దేశ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి...
జ్యోతిర్లిగ శ్లోకాలలో సేతు బంధేతు రామేశ్వరం అనే పాదం ఈ క్షేత్రానికి సంబంధించినదే...
ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరలింగం ఏడవది... రామేశ్వరం తమిళనాడు లోని రామనాథ పురం జిల్లాలో పంబన్ అనే దీవిలో ఉంది...
రామేశ్వరం నాలుగు ప్రక్కలా సముద్రమే ఉంటుంది...
పంబన్ అనే అతి పొడవైన బ్రిడ్జి ద్వారా మాత్రమే మనము రామేశ్వరాన్ని చేరవలసి ఉంటుంది...
రామేశ్వరం దీవి లో ధనుష్కోటి అనే ప్రదేశం నుండి శ్రీలంక లోని మల్లైతీవు అనే ప్రదేశానికి కేవలం 18 నాటికల్ మైళ్ళ దూరంలో ౩౦ కి.మీ. దూరంలో ఉంటుంది...
రామేశ్వరాన్ని దర్శించిన తర్వాతే కాశీ యాత్ర ఫలం సిద్ధిస్తుంది...
అందుకే రామేశ్వరం కూడా కాశీ తో పాటుగా రామేశ్వరాన్ని చేరడం వలన ఈ క్షేత్రం చార్ ధామ్ యాత్రలో ఒక భాగంగా మారుతుంది... శ్రీరాముడు లంకను చేరడానికి నిర్మించిన వారధి ఇక్కడి నుండే మొదలవుతుంది... లంకలోని రావణుడు శివ భక్తుడు... అందుకే ఈ క్షేత్రం శివ కేశవుల మధ్య వారధిగా అనుకోవచ్చు...
left: India... right SriLanka

రామునిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు కనుక రామేశ్వరమయింది...
ఇక్కడి శివుడిని రామేశ్వరుడని, రామలింగమని, రామనాథుడని అంటారు...

క్షేత్ర చరిత్ర:
లంకాధిపతి యైన రావణుడు సీతను చెరబట్టి లంకయందు ఉంచగా.. ఆమెను రక్షించుటకై శ్రీరాముడు రామేశ్వరము నుండి లంకకు బయలు దేరి వేళ్ళినట్లు చరిత్ర చెబుతుంది...రావణుని చంపి రామేశ్వరానికి తిరిగి వచ్చి రావణుని సంహరించడం వలన ఏర్పడిన బ్రహ్మహత్యాపాపము దాని దోష నివారణచేయమని ఈశ్వరుని ప్రార్థించారు... దానికై ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింప సంకల్పించారు.. .. అందుకే తగిన లింగాన్వేషణకై హనుమంతుని కైలాస పర్వతానికి పంపుతారు... హనుమ ఆ అన్వేషణలో ఎంతకూ తిరిగి రావడం లేదు... ఈలోగా ఆలస్యమవుతుందని సీతమ్మ వారు ఇసుకతో లింగాన్ని(సైకత లింగం) చేసి ప్రతిష్ఠించారు....

ఈ లోగా హనుమంతుల వారు లింగాన్ని తీసుకువస్తారు.....తిరిగి వచ్చిన హనుమంతులు తన లింగాన్ని ప్రతిష్ఠించకముందే ప్రతిష్ఠింప బడిన ఆ లింగాన్ని చూసి ఆగ్రహో దగ్రుడై తన తోకతో దాన్ని పెకిలించ ప్రయత్నంచేస్తాడు.... కానీ ఆ లింగం సీతమ్మవారి హస్త మహత్యంతో తయారు చేయబడినది కాబట్టి బయటకు రాలేదు... ...రాముల వారు హనుమంతుని బుజ్జగించి ఆ లింగాన్ని కూడా ఒక దగ్గర ప్రతిష్ఠించి..హనుమా దీనినే విశ్వ లింగమని పిలుస్తారు... మొదట నీవు ప్రతిష్ఠించిన లింగానికి పూజ జరిగిన తర్వాతే నేను ప్రతిష్టించిన లింగాన్ని దర్శించుకుంటారని శ్రీ రాముల వారు మాట ఇచ్చారట... ఇప్పటికీ ఈ విధంగానే మనము దర్శించుకుంటున్నాము...హనుమ ప్రతిష్ఠించిన లింగాన్ని విశ్వ లింగమని... సీతమ్మవారు ప్రతిష్ఠించిన లింగాన్ని రామ లింగమని పిలిస్తారు... 
(ఈ కథ మహర్షి వాల్మీకి రచించినదానిలో కనపడదు...
తులసీదాసుని రామ చరిత మానస్ లో ఉంటుంది) 

దేవాలయముల యొక్క శిల్పము:
ఈ గుడి క్రీ.శ. 17 శతాబ్ధంలో నిర్మించారు... ద్రవిడ శిల్ప కళా రీతిలో ఈ దేవాలయాల శిల్ప కళ ఉంటుంది... ద్వీపం యొక్క సముద్ర తీరాన మూడు మండపములు... చాలా అందమైన స్థంభములతో, వాటిపైన చెక్కబడిన అత్యద్భుత శిల్పములతో వరుసలుగా విరాజిల్లుతున్నాయి... దేవాలయము 865అ. పొడవు, 657 అ. వెడల్పు ఉన్నది...

పై కప్పు 49 అ.ల పొడవుగల రాతి దూలములతో మోయబడుచున్నది... దైవ సన్నిధి పాలిష్ చేయబడినగ్రానైట్ రాయితో కట్ట బడినది... దేవాలయపు ప్రక్కన మూడు మండపములు మొత్తము 4,000 అ.ల పొడవున ఉండడం ప్రపంచంలోని అద్భుతముల్లలో ఇది ఒకటిగా ఎంచబడుతున్నది...
మండపం ఇరువైపులా ఐదు అ.ల ఎత్తుగ వేదికలు, దానిపై 25 అ.ల ఎత్తు గల రాతి స్థంభములు గలవు...

దేవాలయ మండపం 1200 బలిష్టమయిన స్థంభములచే బరువు భరింపబడుతున్నవి...దేవాలయ తూర్పు గోపురం 130 అ.లు , పచిమ గోపురం 80 అడుగులు ఎత్తు ఉన్నవి.... మధ్య మధ్యలో ఇరవైరెండు పవిత్ర తీర్థాలలో స్నాన మాచరిస్తూ సాగుతుంది పయనం...
 

అవన్నీ చాలా అధ్బుతమైన బావులు... ఇక్కడి అన్ని బావులలో స్నానమాచరిస్తే అన్ని దోషాలు, పూర్వజన్మ పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని నమ్మకం...ఒక విశేషమేమంటే.. ఏ రెండు బావులలోని నీరు ఒకే రుచి కలిగి ఉండవు...
( దైవ మాయ కాక వేరేదేముంది...)..
కారిడార్ లో మనం నడిచే టప్పుడు ప్రక్కన పైన చాలా వర్ణ చిత్రాలు చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.. 

మేమ గైడ్ ను ఏర్పాటు చేసుకోలేదు...
మీరు ఆ వసతికై ముందే ఆలోచిస్తే మంచిది...
మేము మొదటి సారి ఒకసారి మణి దర్శనానికి వెళ్ళి అగ్ని తీర్ధంలో సముద్ర స్నానం చేసి మరల రెండవ సారి మూల విరాట్ దర్శనం చేసుకునేటపుడు మాత్రమే ఇరవైరెండు తీర్థాలలో స్నానమాచరించాము...
ఒకే సారి వీటన్నిటినీ చేయలేము.. ఉదయం ఆరు వరకు మూలవిరాట్ దర్శనం ఉండదు...
అందువల్ల తప్పని సరిగా రెండు సార్లు దర్శనం చేసుకోవాల్సిందే...
అన్ని తీర్థాలలో స్నానమాచరించి... పొడిబట్టలతోనే (అంటే తప్పని సరిగా దుస్తులు మార్చుకోవాలి ... తడి దుస్తులతో దర్శనం చేసుకోరాదు) దర్శనం చేసుకోవలసి ఉంటుంది... (ఈ బావులలో స్నానం దగ్గరుండి చేయిస్తామని బ్రోకర్లు అడుగడుగునా ప్రత్యక్షమవుతారు వారి వలలో పడకండి...ధర్మ దర్శన వరుసలో నే వెళ్ళండి).. ఇక్కడ మేము కాశీ నుండి తెచ్చిన గంగా జలాన్ని స్వామి వారికి అభిషేకించాము(వాస్తవంగా దీనికై వేరే టికెట్ తీసుకోవాలి మాకు తెలియక సాధారణ క్యూలోనే వెళ్ళాము... అయ్య వార్లు చా.....లా..... మం...చి...వా....రు రెండు వందల రూపాయలు తీసుకుని అభిషేకంచేసారు.... స్వామి వారి దర్శన మయిన తర్వాత అమ్మవారు పర్వతవర్ధిని దర్శనం ఉంటుంది.. పార్వతిదేవి మండపం లో అష్టలక్ష్ములు కొలవైన విగ్రహాలు చాలా అధ్బుతంగా ఉంటాయి... చూడండి... రామేశ్వరంలో ఉదయం 6:00 లోపు మణి దర్శనం అనే ఒక విశేష దర్శనం ఉంటుంది... ఇది ఒక స్ఫటిక లింగం దర్శనం... లింగం వెనుక దీపం ఉన్న స్థితిలో ... (మూలవిరాట్టుకు ముందు భాగంలో ఉంటుంది).... దర్శనం చేసుకుంటాం.. ఇది చాలా అధ్బుతంగా ఉంటుంది... ఈ మణి శ్రీ మహావిష్ణువు తల్పమైన ఆదిశేషుడి నాగమణి అని అంటుంటారు.... రామేశ్వరం గుడి దీవికి తూర్పు అభిముఖంగా బీచ్ దిశలో ఉంటుంది.. పూజలు: ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరచేఉండును...
1. పళ్ళెరై దీపారాధన- ఉ. 5:00
2. స్ఫటిక లింగారాధన - ఉ. 5:10
3. తవనంతాళ్ దీపారాధన- ఉ.5:45
4. విళాపూజ - ఉ. 7:00
5. కళాశాంతి పూజ- ఉ. 10:00
6. ఉచ్చికాల పూజ - మ. 12:00
7. శయరక్ష పూజ- సా. 6:00
8.అర్థ జాము పూజ- రా. 9:00
9. పళ్ళెరై పూజ - రా 9:30
 గుడిలో దర్శనమైన తర్వాత మేము చుట్టుప్రక్కల చూడదగిన ప్రదేశాలకై బయలు దేరాం... ఒక ఆటొ అతను పేరు: రీజన్(అవును క్రిస్టియనే) ఐదు వందలు అవుతుందని చెప్పడు... నేను బేరమాడలేదు.. కానీ తమ్ముడు నీవు మాకు అంతా బాగా వివరించు... అందుకే బేరమాడడం లేదు... అని రీజనింగు చెప్పి బయలు దేరాం.. చాలా బాగా వివరించాడు... మొదటి మజిలీ ధనుష్కోటి కాదు అయినా రూట్ ప్రకారం ఇది బెస్ట్ అని ఇక్కడి కి తీసుకువచ్చాడు... ధనుస్సు + కోటి... శ్రీరాముల వారు తమ ధనుస్సు యొక్క మొన(కోటి) ని ఇక్కడ తాకించి సేతువు ను కట్టడం ప్రారంభించారట....ఇక్కడ రాముల వారి సేతువు యొక్క ప్రారంభ స్థానం ఉంది..
అది దర్శించుకుని తిరిగి మజిలీ ప్రారంభించాం...

ఇక్కడి కి దగ్గరలోనే ధనుష్కోటి బీచ్ కూడా ఉంటుంది... అది చాలా ప్రమాదకరమయిన బీచ్... ఇక్కడి అలలు అర్ధం కావు... పాజిటివ్ కరెంట్స్ ఉంటాయి.. అందుకే అలలు మనను సముద్రంలోకి లాగేసే అవకాశాలు ఎక్కువ.... ఈ బీచ్ కు టూరిజం వారి అనుమతి ఉండదు.. అందుకే ఆ వైపు వెళ్ళకపోతేనే మంచిది.. ఈ ధనుష్కోటి వెళ్ళే మార్గంలో రెండు వైపులా సముద్రమే ఉంటుంది... బీచ్ లు చాలా క్లీన్ గా పరిశుభ్రంగా ఉన్నాయి.... ఎక్కడా నీచు వాసన అనేది తగులదు... చాలా అధ్బుతమైన ప్రయాణం.. ఇది బంగాళాఖాతం-హిందూ మహా సముద్రం లో కలిసే స్థలం....ఇక్కడ స్నానం చేస్తే మంచిదంటారు కానీ మేము చేయలేదు..

మొదటి మజిలీ: గంధమాధన పర్వతం:

ఇది ఒక కొండ ప్రదేశం ఇక్కడి నుండి చూస్తే మొత్తం రామేశ్వరం... నాలుగు ప్రక్కలా సముద్రం చాలా క్లియర్ గా కనపడింది... హనుమంతుల వారు సీతమ్మ జాడల గురించి రాముల వారి కి వివరించింది ఇక్కడే... ఇక్కడ రాముల వారి పాద ముద్రలు మనం చూడవచ్చు...
రెండవమజిలీ: కోదండ రామార్ టెంపుల్:


రావణుడి తమ్ముడు విభీషణుడు రాముల వారికి లొంగిపోయింది ఇక్కడే ...
దానికి జ్ఞాపకార్థంగా ఇక్కడి గుడిలో సీతా,రామ,లక్ష్మణ,హనుమంతుల విగ్రహాలకు జతగా విభీషణుడి విగ్రహం కూడా మనకు కనపడుతుంది...
మన దేశంలో వేరే ఏ ప్రదేశంలోనూ విభీషణుడి గుడి మనకు కనిపించక పోవచ్చు.. రాముల వారు విభీషణుడి పట్టాభిషేకం చేసింది ఇక్కడే....


మూడవ మజిలీ: శ్రీ రామ తీర్థం:


ఇది శ్రీరాముల వారు స్నాన మాచరించిన తీర్థం... మేము ఇక్కడ రామ సేతువుని నిర్మించడానికి ఉపయోగించిన రాయిని చూశాము.. ఇది వరకు అంతర్జాలంలో మాత్రమే దర్శించాను... కానీ ఇక్కడ దానిని ముట్టుకుని నేను పొందిన అనుభూతిని వివరించలేను... చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే ఆ రాయి సాక్షాత్ శ్రీరాములవారు పాదం మోపిన/మోసిన రాయి మరి...



ఈ విషయాన్నే నా భార్యకు కూడా వివరించాను.... నా భక్తి పారవశ్యం చూసి అక్కడి దేవస్థానం సిబ్బంది ఒకరు .. మీరు నిత్య పూజ నైవేద్యం చేస్తానంటే నాకు ఒక ముక్క ఇస్తానని చెప్పి నూటయాభై రూపాయలకు ఒక ముక్క అమ్మారు..
నా ఆనందం వర్ణనాతీతం ఎందుకంటే ఇక్కడ ఫోటోలు కూడా తీయనీయడం లేదు మరి... నాకు ప్రత్యక్షంగా రాయిని పొందడమంటే మాటలా.. అదే నేను చూసిన రాయి... మరియు పొంది మాఇంట్లో పూజలందుకుంటున్న రాయి..


నాలుగవ మజిలీ: లక్ష్మణ తీర్ధం: ఇది లక్ష్మణుల వారు స్నానమాచరించిన తీర్థం...

ఐదవ చివరి మజిలీ: పంచముఖ ఆంజనేయస్వామి తీర్థం:



ఇక్కడకూడా సేతుబంధన రాళ్ళు ఉన్నాయి... ఇక్కడ కనీసం ముట్టు కోనివ్వలేదు వారు...



పైన వివరణలో అగ్ని తీర్ధం అనే ప్రస్థావన ఉంది కానీ దానిని ఏ స్థానంలో వివరించాలో అర్థం కాలేదు... అందుకే చివరగా దానిని వివరిస్తున్నాను... ఈ తీర్థంలోనే సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేసారట...





రాముల వారు వారధి కట్టే దానికి సముద్రుడు మొదట సహకరించలేదట..
అందుకే రాముల వారు సముద్రుని మీదకు బాణం వేయాలని సంకల్పించిన తరుణంలో సముద్రుడు మనిషి రూపు దాల్చి స్వామి మీకు సహకరిస్తాను శాంతించండి అని శాంతింపచేస్తారట.. అందుకే ఇక్కడ సముద్రం చాలా ప్రశాంతంగా చాలా తక్కువఎత్తు ఉన్న అలలు వీలైనంతవరకు అలలు లేకుండా ఉంటుంది...

Accommodation:
రామేశ్వరంలో గుజరాత్ భవన్ చాలా చౌక అయిన బస... ఒక రూమ్ కు కేవలం రెండువందల రూపాయల నుండి ప్రారంభ ధర.. మేము రెండువందల రూపాయల బసలోనే ఉన్నాం... బాగానే ఉంది... మధ్యతరగతి వారు ఉండవచ్చు.. ఇక్కడ ఇంకా డీలక్స్+ఎసి తరగతుల గదులు కూడా ఉన్నాయి... చాలా పెద్ద భవనం.... ఎప్పుడైనా గదులు దొరుకుతాయి... తూర్పు ద్వారం బీచ్ రోడ్ లో ఉంటుంది... వీలు కుదిరితే బస చేయండి...

How plan the visit in Tamil Nadu:
 మేము మొదట శ్రీరంగం రంగనాథ స్వామి, తర్వాత తంజావూరు బృహదీశ్వరాలయం, మథురై మీనాక్షి దేవాలయం దర్శించుకుని చివరలో రామేశ్వరాన్ని దర్శించాము... మొత్తం నాలుగు రోజుల యాత్ర... కొంచెం ప్లాన్ చేసుకుంటే చిదబరం + మేల్ మరావత్తూర్ ఆది పరాశక్తి ఆలయాలు చూడవచ్చు... ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఉత్తమం... ఉదయం పినాకినీ Express train లో ప్రయాణిస్తే... మధ్యాహ్నం 1:30 కు మద్రాసు చేరుకుంటాం.. అక్కడి నుండి మేల్ మరావత్తూర్ లేదా చిదంబరం చేరుకుని దర్శనం చేసుకుని.. తిరిగి బస శ్రీరంగంలో ఏర్పాటు చేసుకుని...తెల్లవారు ఝామున శ్రీరంగంలో దర్శనం పూర్తిచేసుకుని... ఉదయం ఏడున్నర లోపులో తంజావూరు బయలుదేరితే మధ్యాహ్నం తంజావూరు పెరియ కోవెల్ దర్శనం చేసుకోవచ్చు.. అక్కడ చూడవలసిన మ్యూజియంలు ప్రదేశాలు చాలా ఉన్నాయి... సాయంత్రం తిరుగు టపా మధురై వెళ్ళి అక్కడ బస ఏర్పాటు చేసుకుంటే చాలా శ్రేష్టం... ఇక్కడి నుండి రాత్రి రామేశ్వరం బయలు దేరాలి... రామేశ్వరం నుండి తిరుగు టపా డైరెక్ట్ గా చెన్నై ఐతే ఒక ప్లాన్...తిరుగు టపా మళ్ళీ మధురై వచ్చి అక్కడి నుండి తిరునల్వేలి/తెరుచందూర్/నాగర్ కోయిల్/కన్యాకుమారి ఒక రూట్ లో చూడవచ్చు... రెండవ రూట్ లో పళనిచూడవచ్చు... చాలా ప్రదేశాలు ఉన్నాయి... మీకు మళ్ళీ వివరిస్తాను.. నేను ఉదహరించిన ప్రదేశాలన్నీ నేను స్వయంగా వెళ్ళినవే... ప్రతి ప్రదేశం మీకు వివరిస్తాను....

Post a Comment

Whatsapp Button works on Mobile Device only