Monday, 27 January 2014

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం, తమిళ నాడు

Tiruchendur Subramanyaswami temple information in telugu
Tiruchendur Subramanyaswami temple information in telugu

Tiruchendur Subramanyaswami temple information in telugu
Tiruchendur Subramanyaswami temple information in telugu


ఈ రోజు పుణ్య క్షేత్ర దర్శనం తిరుచెందూర్, తమిళ నాడు :

• తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రంతమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు. 
స్థల పురాణము
ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది.
స్కాంద పురాణంలో
ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.
ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ..... అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.
స్వామివారి రూపం
"తిరుచెందూర్" లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో శక్తివంతమైన, సుందరమైన దివ్య క్షేత్రం యిది.ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.
విభూది మహిమ
ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి.
ఈ క్షేత్రమును చేరే మార్గములు
తిరుచెందూర్ తమిళనాడు లోని Tuticorin జిల్లాలో ఉంది.
• రోడ్ ద్వారా: ట్యూటికోరిన్ - 40Km, తిరునెల్వేలి – 60Km, కన్యాకుమారి – 90Km, మదురై – 175Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ వారి బస్సులు అనేకం నడుస్తాయి.
• రైలు ద్వారా: చెన్నై నుంచి తిరునెల్వేలి దాకా, అనేక రైళ్ళు ఉన్నాయి. (ఉదాహరణకి కన్యాకుమారి ఎక్సప్రెస్) తిరునెల్వేలి నుంచి అనేక బస్సులు, కార్లు దొరుకుతాయి.
• విమానము ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (617Km), అది కాక జాతీయ విమానాశ్రయము ట్యూటికోరిన్ లో (40Km) ఉంది.
వసతి సదుపాయము
ఈ క్షేత్రములో ఆలయ దేవస్థానము వాళ్లవి అనేక గెస్ట్ హౌసులు రోజుకి Rs.115/- నుంచి Rs. 350/- దాకా ఉంటాయి. ఇవి ముందుగా ఆలయం వారి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంతే కాక అనేక ప్రైవేటు హోటళ్ళు కూడా ఉన్నాయి.
ఆలయంలో ఆర్జిత సేవలు
స్వామి వారి అభిషేకము కోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ క్షేత్రము వెడితే ఈ అభిషేకం తప్పక దర్శించగలరు. అద్భుతం గా ఉంటుంది. ఇవి కాక ఇంకా అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన మొదలైన సేవలు ఉన్నాయి.


Tags:
Here is Tiruchendur Subramanya swami temple information in telugu, Hindu temples guide, Temples information in telugu, తిరుచెందూర్  శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం information.


Post a Comment

Whatsapp Button works on Mobile Device only