Tuesday 17 June 2014

పరశురాముడు-శ్రీ మహాభారతంలో కథలు


పరశురాముడు -శ్రీ మహాభారతంలో కథలు పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది.
పరశురాముడి తాత బుచీకుడనే ఋషి. ఆయన గాధిరాజు దగ్గరకు వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు. తాపసికి పిల్లనివ్వటం ఇష్టం లేక, నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని షరతు పెట్టాడు గాధిరాజు. బుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్ళిచేసుకున్నాడు.
తరువాత ఒకసారి గాధిరాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని బుచీకుడ్ని అర్ధించాడు. అప్పుడాయన రెండు రకాల హోమద్రవ్యాలు తయారు చేసాడు.
" ఇదిగో చూడు! ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకు ఇవ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారుచేసాను. ఇది తింటే తపస్సు, శమదమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు" అని భార్యతో చెప్పి బుచీకుడు స్నానానికి వెళ్ళాడు.
అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణించింది. ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికి ఇచ్చి, కూతిరి వంతు హవ్యం తాను తిన్నది.
బుచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు.
" ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు , నీకు పరమ క్రూరుడయిన కొడుకు పుడతారని" బుచీకుడు భార్యతో చెప్పాడు. సత్యవతి బాధపడింది. బుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనుమడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు. బుచీకుని హోమద్రవ్య ఫలంగా గాధిరాజుకు జన్నించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. జమదగ్ని గొప్ప తపస్వి. ఆ మహర్షి సతీమణి రేణుకాదేవి.
మానవులకు తల్లికంటే తండ్రే శ్రేష్ఠమైన దైవమని (పితాపరం దైవతం మానవానం) పరాశరగీత (297-2) తెలిపిన సూక్ష్మధర్మాన్ని పరశురాముడు రుజువు చేశాడు.ఓరోజు జమదగ్ని, పూజ చేసుకునేందుకు, భార్యను వెళ్ళి గంగాజలం తీసుకురమ్మన్నాడు. ఎంతమాత్రం ఆలస్యం చేయవద్దని, పూజకు సమయం మించిపోకుండా, గంగాజలాన్ని త్వరగా తెమ్మని చెప్పాడు. రేణుకాదేవి, భర్త చెప్పినట్లు, నీళ్ళు తెచ్చేందుకు, గంగానదికి వెళ్ళింది. గంగమ్మకు నమస్కరించి, కళ్ళు తెరిచేసరికి గంధర్వులు కనిపించారు. రేణుక ఆశ్చర్యానికి అంతు లేదు. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అలాంటి ఆనందకర దృశ్యాన్ని ఎన్నడూ చూడని రేణుక పరవశంగా చూసింది. 
 కొద్దిసేపు అలా గంధర్వులను చూసిన రేణుక, భర్త కోపావేశాలు గుర్తొచ్చి ఉలిక్కిపడి, తాను తెచ్చిన పాత్రను గంగలో ముంచి ఉదకాన్ని తీసుకుంది. భయంతో గుండె కొట్టుకుంటూ ఉండగా, వేగంగా ఆశ్రమం చేరింది. ఒనుకుతున్న చేతులతో గంగాజలాన్ని భర్త ఎదుట ఉన్న పూజా సామగ్రి దగ్గర ఉంచింది.
 జమదగ్ని దివ్యదృష్టితో చూడనే చూశాడు. భార్య ఆలస్యంగా రావడానికి కారణం తెలీగానే ఆగ్రహంతో దహించుకుపోయాడు. ఆవేశంతో రగిలిపోతూ "పరశురామా! ఈ చంచల మనస్కురాలిని ఒక్క వేటున నరికేయి" అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు మరొకర్ని, ఇంకొకర్ని అయితే అలాగే నరికేసేవాడు. కానీ, ఆమె స్వయంగా తల్లి కావడంతో ఆ పని చేయలేకపోయాడు. తండ్రి మాటా విననట్లు ఊరుకున్నాడు.
 కానీ, జమదగ్ని కోపం తగ్గలేదు.
"పరశురామా, చెప్తోంది నీకే.. వెంటనే పరశువు (గొడ్డలి) తీసుకో... మీ అమ్మని, సోదరుల్నీ కూడా నరుకు.. ఇది నా ఆజ్ఞ" అన్నాడు.
 పరశురాముడికి తండ్రి తపశ్శక్తి తెలుసు కనుక ఇక లేచాడు. ఇక ఆలోచించకుండా కన్నతల్లిని, సోదరులని తన పరశువుతో నరికేశాడు. జమదగ్ని సంతోషానికి అవధుల్లేవు. కొడుకు తన ఆజ్ఞను శిరసావహించాడు. తల్లి అని కూడా చూడకుండా తాను చెప్పినట్లు చేశాడు.
అందుకే, "పరశురామా, నా మాట మన్నించినందుకు సంతోషం.. ఏదైనా వరం కోరుకో" అన్నాడు.
 పరశురాముడు సందేహించకుండా,
"నాన్నా, దయచేసి అమ్మని, సోదరులని మళ్ళీ బతికించు.. అంతకంటే ఇంకేం అక్కర్లేదు" అన్నాడు. జమదగ్ని కోపగించుకోలేదు.
"తథాస్తు" అన్నాడు.
పరశురాముని తల్లి రేణుకాదేవి, సోదరులు పునర్జీవితులయ్యారు.
అయినా పరశురామునికి సంతోషం కలగలేదు. దుఃఖంతో రగిలిపోయాడు.

కార్తవీర్యార్జునుడు (సంస్కృతం: कार्तवीर्य अर्जुन, IAST: Kārtavīrya Arjuna) హైహయ వంశజుడైన కృతవీర్యుడు పుత్రుడు. ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి.

ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.

ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు రాగానే జరిగినదంతా చెప్పి భోరున ఏడ్చింది తల్లి రేణుకాదేవి.
పరశురాముడు మాట్లాడలేదు. గొడ్డలి చేత పట్టుకున్నాడు. ఆమడ దూరానికో అడుగు వేస్తూ కదలివెళ్ళాడు. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు.
మాహీష్మతీపురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెదకి వెదకి గర్భాలలొ వున్న పిండాలతో సహా క్షత్రియులందర్నీ నాశనం చేశాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. అదే నేటి శమంతపంచకం.

తరువాత అశ్వమేధయాగం చేసి ఆ భూమిని కశ్యపుడికి దక్షిణగా ఇచ్చాడని (త్రి:  సప్తకృత్వ: పృథి వీం ని: క్షత్రా మకరోద్విభు:) అగ్నిపురాణం (4-19), భారతం (శాం.ప. 49-64), భాగ. (9-16-19 26, 27) వివరించాయి.

అప్పటినుండి భూమికి 'కశ్యపి' అనే పేరు వచ్చింది.
"భూమిని నాకిచ్చేశావు. ఇంక దీని మీద హక్కు లేదు నీకు. దక్షిణ సముద్రతీరానికి వెళ్ళు" అన్నాడు కశ్యపుడు. పొరపాటున తప్పించుకున్న రాజవంశపు మొలకలు ఏమైనా మిగిలితే వాటిని రక్షించవచ్చన్న ఉద్ధేశంతో ఆయన అలా ఆదేశించాడు. (ఇక్కడ దశరథుడు ఆలమందల మధ్యలో దాగుకుని పరశురాముడి బారినుండి తప్పించుకుంటాడట. ఇలా కొద్దో గొప్పో ఎవరైనామిగిలితే వారి పనీ పట్టే దానికి తిరిగి రావాలనే) సరేనన్నాడు పరశురాముడు. 
దక్షిణ సముద్రానికి వెళ్ళిన పరశురాముడికి సముద్రుడు తనకు చోటు ఇవ్వడట .. అందుకై కోపించిన పరశురాముడు తన గండ్రగొడ్డలి సముద్రుడిపై విసురుతాడట.. అప్పుడు భయపడిన సముద్రుడు కొంత భూభాగాన్ని అతనికి కేటాయిస్తాడని అదే ప్రస్తుత కేరళ అని ఒక ఇతిహాసం... 
చాలా మంది పరశురాముని అవతారం కూడా శ్రీమహావిష్ణువు అవతారమని అంటారు... కానీ ఆయనకు ఆలయాలు కనిపించవు... కేరళలో మాత్రమే పరశురామ ఆలయాలు ఉండడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు...

దేశంలో పరిపాలనాదక్షుడైన రాజు లేక పోతే అరాచకత్వం రాజ్యమేలుతుంది.. శ్రీరాముడు అవతారణ మొదలయ్యేటప్పటికి ఉన్న స్థితి ఇదే... క్షత్రియులు లేకపోవటం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి. ఆరాజ్యకత్వ దోషంతో ధర్మకాంతి క్షీణించింది. అధర్మాన్ని సహించలేక భూమి పాతాళానికి కృంగిపోతుంటే కశ్యపుడు తన తొడ ఆధారంగా చేసి భూమిని నిలబెట్టాడు.
ఊరువులతో ఎత్తబడినందుకే దానిని 'ఉర్వి' అన్నారు.
"మహాత్మా! పరశురాముని బారినుంచి కొందరు రాజకుమారుల్ని రక్షించి నాలో దాచుకున్నాను. వాళ్ళందరూ ఉత్తమ జాతి క్షత్రియులే. వాళ్ళను పిలిపించి నాకు అధిపతుల్ని చేస్తే నేను సుఖంగా ఉంటాను" అంది భూదేవి. కశ్యపుడు వాళ్ళందర్నీ పిలిపించి ఆమె చెప్పినట్లే అభిషిక్తుల్ని చేశాడు.
దశరథుడు కూడా వాళ్ళలో ఒకడు... నేలతల్లి సంతోషించింది.

పరశురాముడు అవతారపురుషుడైనా అతణ్ణి ఓడించిన సందర్భం ఒకటుంది. శివధనస్సు  విరిచి, వివాహితుడై సీతాదేవితో వచ్చే దశరథరాముణ్ణి ఎదిరించి పరశురాముడు భంగపడ్డాడు – రామాయణం (బా.కాం.76-21, 22). ఇందుకు కారణం లేకపోలేదు.
‘పరశురామా! దశరథరాముడి సందర్శనం అయ్యాక, నీవు శస్త్రం పట్టవద్దు. ఎందుకంటే నీ వైష్ణవ తేజస్సు అతనిలో ప్రవేశిస్తుంది. అది సురకార్యం నిర్వహిస్తుంది. నీలో వైష్ణవ తేజస్సు ఉన్నంతకాలమే నీవు శత్రుగణాలను చెండాడగలవు (తవ తేజోహి వైష్ణవం రామం ప్రవేక్ష్యతి) అని శంకరుడు పరశురాముణ్ణి లోగడ హెచ్చరించడమే దీనికి కారణం – వి.ధ.పు (66-13,14). ఒక విష్ణు అవతారం మరో విష్ణు అవతారాని ఓడించిన సదర్భం ఇదొక్కటే!

శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల నుండి సేకరించినది

Whatsapp Button works on Mobile Device only